
హైదరాబాద్, 27 నవంబర్ (హి.స.)
హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తిరుపతికి బయల్దేరిన విమానం కొద్దిసేపటికే తిరిగి వెనక్కి రావాల్సి వచ్చింది. తిరుపతి ప్రాంతంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో విమానాన్ని అక్కడ ల్యాండ్ చేయడం సాధ్యపడలేదు. దీంతో పైలట్లు విమానాన్ని తిరిగి శంషాబాద్ విమానాశ్రయానికి మళ్లించారు.
తిరుపతిలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా విమానాన్ని హైదరాబాద్కు తిరిగి తీసుకొచ్చినట్లు సమాచారం. శంషాబాద్ విమానాశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ పరిణామంతో తిరుపతికి వెళ్లాల్సిన ప్రయాణికులు కొంత ఇబ్బందికి గురయ్యారు. వాతావరణ పరిస్థితులు మెరుగుపడిన తర్వాత విమాన ప్రయాణంపై తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. విమాన సర్వీసుల పునరుద్ధరణపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్