
సంగారెడ్డి, 27 నవంబర్ (హి.స.)
సంగారెడ్డి జిల్లాలో కురిసిన వర్షం రైతులకు నష్టాన్ని మిగిల్చింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా చౌటకూరు మండలం చక్రియాలలో కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ ఉంచిన ధాన్యం బస్తాలు వర్షపు నీటికి తడిసిపోయాయి. జోగిపేటలోనూ వర్షం కారణంగా ధాన్యం కొట్టుకుపోయినట్లు సమాచారం.
పంటను కష్టపడి పండించి విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన సమయంలో వర్షం పడటంతో రైతులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ధాన్యం తడిసిపోవడంతో నాణ్యత దెబ్బతింటుందని, కొనుగోలుకు అధికారులు అభ్యంతరాలు చెబుతారేమోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోవడంతో మరింత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి కొనుగోలు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ధాన్యం నష్టాన్ని అంచనా వేయాలని రైతులు అభ్యర్థిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్