
అమరావతి , 27 నవంబర్ (హి.స.)
విద్యావేత్త మంగాదేవి మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. విద్యారంగంలో ఆమె చేసిన విశేష సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఎంతోమంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడమే కాకుండా, వారి జీవితాలకు సరైన దిశానిర్దేశం చేసిన గొప్ప వ్యక్తిగా మంగాదేవి నిలిచిపోయారని పేర్కొన్నారు.
బాలకుటీర్, చేతన విద్యాసంస్థల ద్వారా ఆమె అందించిన సేవలు సమాజానికి ఎంతో విలువైనవని లోకేశ్ కొనియాడారు. విద్యను కేవలం పాఠాలకే పరిమితం చేయకుండా, విద్యార్థుల్లో మానవీయ విలువలు, సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు ఆమె చేసిన కృషి అభినందనీయమన్నారు. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఆమె కీలక పాత్ర పోషించారని తెలిపారు. సమాజ సేవకు అంకితమైన ఆమె జీవితాన్ని ఎప్పటికీ మరచిపోలేమని పేర్కొన్నారు.
మంగాదేవి మరణం విద్యారంగానికి, సమాజానికి తీరని లోటని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మానవతామూర్తి మంగాదేవి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు నారా లోకేశ్ వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్