రేగుపాలెం జంక్షన్లో ఘోర ప్రమాదం.. లారీ నుంచి ఇనుప కట్ట పడి విద్యార్థిని మృతి
అనకాపల్లి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎలమంచిలి మండలం రేగుపాలెం జంక్షన్ వద్ద ఇనుప బండిళ్లతో వెళ్తున్న లారీ నుంచి కట్ట కిందపడి ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది.
Accident


అనకాపల్లి జిల్లా, 27 నవంబర్ (హి.స.)

అనకాపల్లి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎలమంచిలి మండలం రేగుపాలెం జంక్షన్ వద్ద ఇనుప బండిళ్లతో వెళ్తున్న లారీ నుంచి కట్ట కిందపడి ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. కాలేజీకి వెళ్లేందుకు తన తండ్రితో కలిసి రేగుపాలెం జంక్షన్ వద్ద వేచి ఉన్న నాగసాయిలక్ష్మిపై ఒక్కసారిగా ఇనుప బండిల్ పడింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ మార్గమధ్యంలోనే మృతి చెందింది. విద్యార్థిని తండ్రికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

సమాచారం అందుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదం జరిగిన విధానంపై పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రేగుపాలెం జంక్షన్ వద్ద తక్షణమే సిగ్నల్ పాయింట్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పోలీసు శాఖ, జాతీయ రహదారుల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రమాదాలకు అవకాశం ఉన్న బ్లాక్ స్పాట్లను గుర్తించి అక్కడ అదనపు భద్రతా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని హోంమంత్రి ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande