జవాను వేణు వీరమరణం బాధాకరం.. పవన్ కల్యాణ్
సంతాపం దేశ రక్షణ విధుల్లో ప్రాణాలు కోల్పోయిన వీర జవాను వేణు మృతిపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Pavan Kalyan


అమరావతి , 27 నవంబర్ (హి.స.)సంతాపం

దేశ రక్షణ విధుల్లో ప్రాణాలు కోల్పోయిన వీర జవాను వేణు మృతిపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు నదిలో మునిగి ఆయన మరణించారన్న వార్త తనను కలచివేసిందని తెలిపారు. దేశ సేవలో నిమగ్నమైన ఓ సైనికుడు ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు.

దేశ సరిహద్దుల రక్షణతో పాటు వివిధ ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులను సైతం లెక్కచేయకుండా సైనికులు నిరంతరం విధులు నిర్వర్తిస్తున్నారని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. ఎండ, వాన, చలి వంటి కఠిన పరిస్థితుల్లో దేశ భద్రత కోసం వారు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ దేశ ప్రజల రక్షణ కోసం సైనికులు చూపుతున్న అంకితభావం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.

వీర జవాను వేణు దేశం కోసం అందించిన సేవలను ఎప్పటికీ గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. ఆయన మరణం కుటుంబ సభ్యులకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో వేణు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. వీర జవాను ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande