
అమరావతి , 27 నవంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం దాదాపు మూడు గంటల పాటు కొనసాగింది. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామిక పెట్టుబడులు, మౌలిక వసతులు, విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించిన 30 అంశాల అజెండాకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. పరిశ్రమల స్థాపనలో అనవసర జాప్యాన్ని అరికట్టేందుకు రూపొందించిన ఏపీ ఎంఎస్ఎంఈ రైట్ టు బిజినెస్ బిల్లు-2026కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సీఐఐ సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకున్న ఆరు సంస్థల పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. వీటి ద్వారా సుమారు రూ.36 వేల కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. పెనుకొండలో రూ.19 వేల కోట్లతో కియా రెండో ఆటోమొబైల్ ప్లాంట్, శ్రీకాకుళంలో అదానీ టైటానియం కాంప్లెక్స్, అచ్యుతాపురంలో సెయింట్ గోబైన్ గ్లాస్ పరిశ్రమ ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసింది.
అమరావతిలో హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయ నిర్మాణాలకు నిధులు కేటాయించడంతో పాటు పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది. విద్యుత్ ఉత్పత్తి పెంపునకు సోలార్, పవన విద్యుత్ ప్రాజెక్టులకు భూముల కేటాయింపునకు అనుమతించింది. మరోవైపు అనంతపురం, రైల్వేకోడూరు ప్రాంతాల్లో వేలాది ఎకరాల భూ రికార్డుల సవరణకు కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్