సమయస్ఫూర్తితో వ్యవహరించి విద్యార్థి ప్రాణాలు కాపాడిన గచ్చిబౌలి పోలీసులు
హైదరాబాద్లో ఆత్మహత్యకు యత్నించిన హెచ్సీయూ విద్యార్థిని గచ్చిబౌలి పోలీసులు చాకచక్యంగా కాపాడారు.
సమయస్ఫూర్తితో వ్యవహరించి విద్యార్థి ప్రాణాలు కాపాడిన గచ్చిబౌలి పోలీసులు


హైదరాబాద్ , 27 నవంబర్ (హి.స.)

హైదరాబాద్లో ఆత్మహత్యకు యత్నించిన హెచ్సీయూ విద్యార్థిని గచ్చిబౌలి పోలీసులు చాకచక్యంగా కాపాడారు. పెట్రోలింగ్ విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది సకాలంలో స్పందించి విద్యార్థి ప్రాణాలను రక్షించారు. భవనంపై నుంచి దూకేందుకు ప్రయత్నిస్తున్న విషయాన్ని గుర్తించిన పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహరించి అతడిని ప్రమాదం నుంచి బయటపడేశారు.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్కు చెందిన అభినవ్ లక్రా (21) హైదరాబాద్లోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (హెచ్సీయూ)లో ఎంఎస్సీ సైకాలజీ చదువుతున్నాడు. అయితే అతడు ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించిన పెట్రోలింగ్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. విద్యార్థి భవనం మీద నుంచి దూకకుండా అడ్డుకుని సురక్షితంగా కాపాడారు.

పోలీసుల అప్రమత్తత, తక్షణ చర్యలతో పెను ప్రమాదం తప్పింది. విద్యార్థిని రక్షించిన గచ్చిబౌలి పెట్రోలింగ్ సిబ్బందిపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థి ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏమిటనే విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అతడి పరిస్థితి, తదుపరి చర్యలకు సంబంధించి పోలీసులు వివరాలు వెల్లడించాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande