
తిరుమల, 27 నవంబర్ (హి.స.)
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రాక కొనసాగుతోంది. కొండపై భక్తుల రద్దీ ఉండటంతో టోకెన్లు లేని భక్తులు సర్వదర్శనం కోసం సుమారు 12 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోంది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లలో భక్తులు దర్శనం కోసం నిరీక్షిస్తున్నారు.
మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. నిన్న ఒక్కరోజే మొత్తం 57,756 మంది భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.
శ్రీవారి పట్ల భక్తులు తమకున్న భక్తిని కానుకల రూపంలో చాటుకున్నారు. హుండీ ద్వారా రూ.4.30 కోట్ల ఆదాయం సమకూరింది. అలాగే 21,917 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వారాంతం కావడంతో రానున్న రోజుల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. దర్శనానికి వచ్చే భక్తులు తగిన సమయాన్ని కేటాయించుకుని తిరుమల యాత్రకు రావాలని సూచిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్