
తిరుమల, 27 నవంబర్ (హి.స.)తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి టికెట్లు, దర్శన టోకెన్ల జారీ షెడ్యూల్‌ను టీటీడీ ప్రకటించింది. భక్తులు ముందుగానే తమ దర్శనాలను ప్రణాళిక చేసుకునేలా వివిధ కోటాల విడుదల తేదీలు, సమయాలను వెల్లడించింది. ఇందులో భాగంగా రేపు ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. నవంబర్ 30న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు అందుబాటులోకి రానున్నాయి.
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల సందర్భంగా డిసెంబర్ 20, 21 తేదీల్లో దర్శనం కోసం డిసెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు భక్తులు ఆన్లైన్లో ఈ-డిప్‌కు నమోదు చేసుకోవచ్చు. డిసెంబర్ 7న మధ్యాహ్నం 3 గంటలకు ఈ-డిప్ ద్వారా స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను కేటాయించనున్నారు. డిసెంబర్ 8న ఉదయం 10 గంటలకు దాతల దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు.
మరోవైపు, రద్దీని నియంత్రించి సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చే ఉద్దేశంతో డిసెంబర్ 20, 21 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. అయితే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రం మినహాయింపు ఉంటుంది. ఈ రెండు రోజుల్లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలు కూడా ఉండవని స్పష్టం చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్