
న్యూఢిల్లీ, నవంబర్ 27: (హి.స.)
హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి, సుస్థిరత, భద్రత, సుస్థిర అభివృద్ధిని నెలకొల్పడం ఆ ప్రాంతంలోని అన్ని దేశాల సామూహిక బాధ్యత అని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు. ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ (ఐఓఆర్ఏ - IORA) 25వ మంత్రుల మండలి సమావేశానికి న్యూఢిల్లీ ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచ వాణిజ్యం, ఇంధన భద్రత, అనుసంధానత, ఆర్థిక శ్రేయస్సుకు హిందూ మహాసముద్రం కీలక కేంద్రంగా ఉందని జైశంకర్ పేర్కొన్నారు. మారుతున్న అంతర్జాతీయ, భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఐఓఆర్ఏ సభ్య దేశాలు మరింత సమన్వయంతో పనిచేయాలని, సమష్టి స్వరాన్ని బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
2025-2027 కాలానికి ఐఓఆర్ఏ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న భారత్, 'మహాసాగర్' (MAHASAGAR - మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ అక్రాస్ రీజియన్స్) దార్శనికతతో ముందుకు సాగుతోందని తెలిపారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఆవిష్కరణ, బహిరంగత, స్థితిస్థాపకత, అనుకూలత అనే థీమ్‌తో భారత్ తమ అధ్యక్ష కాలాన్ని నిర్వహిస్తోందని వివరించారు.
ఈ సమావేశంలో 23 సభ్య దేశాలు, 12 సంభాషణ భాగస్వామ్య దేశాల మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొంటున్నారు. శ్రీలంక, మారిషస్, సీషెల్స్ సహా పలు దేశాల విదేశాంగ మంత్రులు ఈ సదస్సులో పాల్గొని సముద్ర భద్రత, బ్లూ ఎకానమీ, వాణిజ్య అనుసంధానత, విపత్తు నిర్వహణ వంటి అంశాలపై చర్చిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi