
ముజఫరాబాద్ (పీఓకే), , 27 నవంబర్ (హి.స.)
పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ (పీఓకే)లోని రావల్కోట్ నగర పాలక సంస్థ మేయర్ అబ్దుల్ నయీమ్ ఖాన్‌ను ప్రభుత్వం పదవి నుంచి తొలగించింది. ఆయన 'జాతి వ్యతిరేక కార్యకలాపాలకు' (యాంటీ-నేషనల్ యాక్టివిటీస్) పాల్పడుతున్నారంటూ ఆరోపించిన పాక్ యంత్రాంగం, మేయర్ పదవి నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇటీవల పీఓకేలో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) ఆధ్వర్యంలో స్థానిక హక్కుల కోసం పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు, నిరసనలు జరుగుతున్నాయి. ఈ ఆందోళనల నేపథ్యంలో అణచివేత చర్యలు చేపట్టిన పాక్ అధికారులు, ఉగ్రవాద నిరోధక చట్టాల కింద రావల్కోట్ మేయర్ అబ్దుల్ నయీమ్ ఖాన్‌తో సహా మరో 75 మంది పేర్లను 'ఫోర్త్ షెడ్యూల్' (నిఘా జాబితా)లో చేర్చారు. అనంతరం ఆయనపై జాతి వ్యతిరేకి అనే ముద్ర వేసి పదవి నుంచి తొలగించారు.
మరోవైపు, పీఓకేలో కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు, నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పీఓకే ప్రధానమంత్రి ఇఫ్తిఖార్ గిలానీ పేర్కొన్నారు. అయితే, ప్రజా ప్రతినిధులపై ఇలాంటి కఠిన చర్యలు తీసుకోవడంపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi