
అమరావతి , 03 నవంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్లో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాల్లో కూటమి పార్టీల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో టీడీపీ, జనసేన అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతుండగా, బీజేపీ కూడా కొన్ని చోట్ల ముందంజలో ఉంది. ముఖ్యంగా టీడీపీ అత్యధిక స్థానాల్లో ఆధిక్యం సాధిస్తూ తన బలాన్ని చాటుకుంటోంది.
రాష్ట్రంలోని 13 కార్పొరేషన్లలో టీడీపీ ఎనిమిది చోట్ల ఆధిక్యంలో ఉంది. గుంటూరు, చిత్తూరు, విశాఖపట్నం, తిరుపతి, కడపతో పాటు విజయనగరం, కర్నూలు, మచిలీపట్నం కార్పొరేషన్లలో టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఏలూరు కార్పొరేషన్లో జనసేన ఆధిక్యం ప్రదర్శిస్తోంది.
ఇక 87 మున్సిపాలిటీల్లోనూ కూటమి పార్టీల మధ్య ఆధిక్యాలు కనిపిస్తున్నాయి. టీడీపీ 27 మున్సిపాలిటీల్లో, జనసేన 13 మున్సిపాలిటీల్లో ముందంజలో ఉన్నాయి. అమలాపురం, నరసాపురం, తెనాలి, పిఠాపురం, పెడన వంటి ప్రాంతాల్లో జనసేన అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గిద్దలూరు, ఎలమంచిలిలో బీజేపీ అభ్యర్థులు ముందున్నారు. నెల్లిమర్లలో స్వతంత్ర అభ్యర్థి అప్పల్నాయుడు ఆధిక్యంలో ఉన్నారు.
ఈ ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కూటమి పార్టీలకు అనుకూల వాతావరణాన్ని సూచిస్తున్నాయి. అయితే తుది ఫలితాలు వెలువడే వరకు ఆధిక్యాల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్