మస్కట్లో చిక్కుకున్న మహిళను స్వదేశానికి రప్పించిన కేటీఆర్
మస్కట్లో చిక్కుకుపోయిన కొడంగల్ నియోజకవర్గానికి చెందిన తుప్పుడు లక్ష్మిని సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహకరించారు.
Ktr


హైదరాబాద్, 03 నవంబర్ (హి.స.)

మస్కట్లో చిక్కుకుపోయిన కొడంగల్ నియోజకవర్గానికి చెందిన తుప్పుడు లక్ష్మిని సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహకరించారు.

కొడంగల్ నియోజకవర్గంలోని గోకఫసల్వాడ గ్రామానికి చెందిన తుప్పుడు లక్ష్మి, ఆమె భర్త వెంకటప్ప ఉపాధి కోసం ఫిబ్రవరి 27న మస్కట్కు వెళ్లారు. అయితే అక్కడికి చేరుకున్న తర్వాత ఏజెంట్ చెప్పిన పనికి భిన్నమైన పని అప్పగించడంతో లక్ష్మి తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

ఉపాధి కల్పిస్తామని ఏజెంట్ నమ్మించి మోసం చేయడం, యజమాని ఆమె పాస్పోర్టును స్వాధీనం చేసుకుని స్వదేశానికి పంపించేందుకు నిరాకరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

తనను విదేశాలకు పంపించిన ఏజెంట్ కూడా ఫోన్కు స్పందించకుండా, తిరిగి భారత్కు పంపించేందుకు రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు లక్ష్మి కుటుంబ సభ్యులకు తెలిపింది.

ఈ క్రమంలో ఆమె వైఫై, సిమ్ కార్డు సేవలు కూడా నిలిచిపోవడంతో కుటుంబ సభ్యులతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. చివరకు పక్కింటివారి ఇంటర్నెట్ సహాయంతో కుమారుడు రాజును సంప్రదించి అక్కడ ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. తల్లి పడుతున్న కష్టాలను తెలుసుకున్న కుమారుడు రాజు సెప్టెంబర్ 29న కేటీఆర్ను కలిసి కుటుంబ పరిస్థితిని వివరించారు. స్పందించిన కేటీఆర్ నెల రోజుల్లోనే పాస్పోర్టు సమస్యను పరిష్కరించి, తల్లిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొస్తానని భరోసా ఇచ్చారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు లేఖ రాయడంతో పాటు అవసరమైన చర్యలు తీసుకున్నారు. దీంతో లక్ష్మి స్వదేశానికి చేరుకున్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande