
నల్గొండ, 03 నవంబర్ (హి.స.)
ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో రైతులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సూచించారు.
రానున్న రోజుల్లో ఎల్నినో ప్రభావంతో వాతావరణంలో చోటుచేసుకునే మార్పులను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, విద్యుత్ శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆకస్మికంగా వీస్తున్న బలమైన గాలులు, వర్షాల కారణంగా పంటలకు జరుగుతున్న నష్టాన్ని అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. పంటలు దెబ్బతిన్న ప్రాంతాలను స్వయంగా సందర్శించి నష్ట వివరాలను సేకరించాలని, బాధిత రైతులకు అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఎల్నినో ప్రభావంతో భవిష్యత్తులో ఏర్పడే వాతావరణ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, వ్యవసాయ రంగంపై పడే ప్రభావాన్ని రైతులకు వివరించాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు