
హైదరాబాద్, 03 నవంబర్ (హి.స.)
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు పొందాలనుకునే పట్టభద్రులకు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఊరటనిచ్చింది.
ఓటరు నమోదుకు ఈ నెల 6వ తేదీతో గడువు ముగుస్తుందంటూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. గడువు దాటిన తర్వాత కూడా ఓటు నమోదు కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని ఆయన స్పష్టం చేశారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు సంబంధించి తెలంగాణ సీఈవో వెబ్సైట్లో ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియలో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. గత మూడు రోజులుగా వెబ్సైట్లో ఇబ్బందులు తలెత్తడంతో పలువురు పట్టభద్రులు తమ ఓటు హక్కును గడువులోగా నమోదు చేసుకోలేమేమోనని ఆందోళన చెందారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో సీఈవో చేసిన ప్రకటన వారికి ఊరటనిచ్చింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నవంబర్ 25న ప్రాథమిక ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. అదే రోజు నుంచి డిసెంబర్ 10 వరకు ఓటర్ల నుంచి కొత్త దరఖాస్తులు, జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తారు.
అనంతరం డిసెంబర్ 10న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. తుది ఓటర్ల జాబితా ప్రచురించిన తర్వాత కూడా ఓటు నమోదు కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని సుదర్శన్ రెడ్డి తెలిపారు. దీంతో సాంకేతిక సమస్యల కారణంగా దరఖాస్తు చేయలేకపోయిన పట్టభద్రులకు మరింత అవకాశం లభించనుంది
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..