
కర్నూలు జిల్లా, 05 నవంబర్ (హి.స.)
కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం గుమ్మనూరులో టీడీపీ, బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెండు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగడంతో గ్రామంలో కొంతసేపు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఘర్షణలో ఇరు వర్గాల వారు రాళ్లు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అంతేకాకుండా కారంపొడి చల్లుకుంటూ గొడవకు దిగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. పోలింగ్ కేంద్రంలోకి వెళ్తున్న వైసీపీ ఏజెంట్‌ను బీజేపీ నేత గుమ్మనూరు నారాయణ ప్రశ్నించడంతో వివాదం మొదలైంది. ఈ విషయమై ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో పోలింగ్ కేంద్రం బయట ఉన్న టీడీపీ, బీజేపీ వర్గాల కార్యకర్తలు కూడా వాగ్వాదంలో జోక్యం చేసుకున్నారు. దీంతో ఇరు పార్టీల శ్రేణులు ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడ్డారు.
ఈ ఘటనలో రెండు వర్గాలకు చెందిన మొత్తం ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఒక్కసారిగా చోటుచేసుకున్న ఈ పరిణామంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలింగ్ సమయంలో రాజకీయ వర్గాల మధ్య చోటుచేసుకున్న ఈ ఘర్షణ చర్చనీయాంశంగా మారింది. పరిస్థితులు అదుపు తప్పకుండా అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్