
అమరావతి , 05 నవంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కడప జిల్లా పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లెలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది. టీడీపీ నాయకులకు చెందిన కార్లపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దాడి నేపథ్యంలో స్థానికంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాల మధ్య ఘర్షణ మరింత ముదరకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు.
మరోవైపు పల్నాడు జిల్లాలోని ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెంలోనూ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి వివాదం తలెత్తింది. వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి సరిత కలెక్టర్ వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలింగ్ కేంద్రంలోకి తనను అనుమతించడం లేదని ఆమె కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై నిరసన వ్యక్తం చేస్తూ వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ కొంతసేపు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఆందోళన చేస్తున్న వైసీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఈ రెండు ఘటనలు ఆయా ప్రాంతాల్లో రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్