
గుంటూరు జిల్లా, 05 నవంబర్ (హి.స.)
గుంటూరు జిల్లా పెదకాకానిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ కేంద్రం వద్ద తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని చివరకు తోపులాటకు దారితీసింది. దీంతో కొద్దిసేపు అక్కడ గందరగోళ వాతావరణం ఏర్పడింది.
పోలింగ్ కేంద్రంలో టీడీపీ తరఫున విధులు నిర్వహిస్తున్న పోలింగ్ ఏజెంట్‌ను వైఎస్సార్సీపీ ఏజెంట్లు దుర్భాషలాడినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి పరస్పరం వాగ్వాదానికి దిగారు. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు వెంటనే జోక్యం చేసుకున్నారు. ఇరుపార్టీలకు చెందిన వారిని పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపించారు.
పోలింగ్ ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఘటన నేపథ్యంలో పోలింగ్ కేంద్రం పరిసరాల్లో భద్రతను పర్యవేక్షించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరించారు. దీంతో కొద్దిసేపటి ఉద్రిక్తత అనంతరం పరిస్థితి సద్దుమణిగింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్