
హైదరాబాద్ , 05 నవంబర్ (హి.స.)
తెలంగాణలో భూగర్భజలాల సంరక్షణ, నీటి వనరుల పునరుద్ధరణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో కరవు నివారణ చర్యలు, భూగర్భజలాల పరిరక్షణపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భవిష్యత్తులో నీటి కొరత సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో ముందుకు సాగాలని సూచించారు.
ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భజల, నీటిపారుదల శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భూగర్భజలాల మట్టాలు తగ్గిపోకుండా తీసుకోవాల్సిన చర్యలు, ఇప్పటికే క్షీణించిన నీటి వనరులను తిరిగి పునరుద్ధరించే మార్గాలపై చర్చించారు. ఆయా శాఖలు సమన్వయంతో పనిచేస్తూ సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని మంత్రి స్పష్టం చేశారు.
భూగర్భజలాల నిర్వహణలో ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు. అక్కడ అమలవుతున్న విజయవంతమైన పద్ధతులను పరిశీలించి, తెలంగాణ భౌగోళిక పరిస్థితులు, స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. కరవు ప్రభావాన్ని తగ్గించడంతో పాటు వర్షపు నీటిని సమర్థంగా ఒడిసిపట్టి భూగర్భజలాలను పెంపొందించే చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించేలా దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్లాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్