శస్త్రచికిత్స వికటించిందంటూ ఆరోపణలు.. ప్రైవేటు ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన
సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్లో ఓ ప్రైవేటు ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
శస్త్రచికిత్స వికటించిందంటూ ఆరోపణలు.. ప్రైవేటు ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన


సిద్దిపేట, 05 నవంబర్ (హి.స.)

సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్లో ఓ ప్రైవేటు ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుటుంబ సభ్యురాలు ప్రాణాలు కోల్పోయిందని వారు ఆరోపించారు.

వర్గల్ ప్రాంతానికి చెందిన కల్పన ప్రసవం కోసం గజ్వేల్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిని ఆశ్రయించారు. ఈ క్రమంలో అక్కడి వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించారు. అయితే ఆపరేషన్ అనంతరం కల్పన ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఆస్పత్రి సిబ్బంది ఆమెను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు.

అక్కడి ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందించినప్పటికీ కల్పన ప్రాణాలను కాపాడలేకపోయారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బంధువులు గజ్వేల్లోని సంబంధిత ప్రైవేటు ఆస్పత్రి ఎదుట నిరసన చేపట్టారు. శస్త్రచికిత్స సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande