
హైదరాబాద్, 05 నవంబర్ (హి.స.)
రాష్ట్రంలో అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, సమాచార హక్కు చట్టం నిరర్థకంగా మారడంపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
గురువారం బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులపై తీవ్ర ఆరోపణలు చేశారు.
హైదరాబాద్ ఖానామెట్ పరిధిలోని అయ్యప్ప సొసైటీలో హైకోర్టు ఉత్తర్వులను సైతం ఉల్లంఘిస్తూ అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తున్నారని కవిత ఆరోపించారు. ముఖ్యమంత్రి నివాసానికి అతి సమీపంలోనే ఇదంతా జరుగుతున్నా ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం వెనుక సీఎం సోదరుల ప్రమేయం ఉందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అయ్యప్ప సొసైటీ పరిసరాల్లోని సర్వే నంబర్లు 11, 18 నుంచి 44 వరకు సుమారు 500 నుంచి 700 వరకు అక్రమ భవనాలు వెలిశాయని, సర్వే నంబర్ 12లో నిబంధనలకు విరుద్ధంగా 12 అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారని తెలిపారు. ఈ అక్రమ వ్యవహారంపై ఇతర రాజకీయ పార్టీలు మౌనం వహించడాన్ని ఆమె తప్పుపట్టారు.
అయ్యప్ప సొసైటీ అక్రమాలపై గూగుల్ మ్యాప్ ఆధారాలతో కథనాలు ప్రచురించిన మీడియా ప్రతినిధులను, జర్నలిస్టులను అక్కడి నిర్మాణదారులు బెదిరిస్తున్నారని, ప్రభుత్వం తమ వెంటే ఉందంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కవిత పేర్కొన్నారు. వార్తలు రాసే జర్నలిస్టులకు తగిన రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయ్యప్ప సొసైటీ సహా అన్ని అక్రమ నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని ఆమె డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..