
బాపట్ల , 06 నవంబర్ (హి.స.)
బాపట్ల జిల్లాలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించి పరిస్థితులను సమీక్షించారు. తొలుత తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా పరిశీలిస్తూ ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం జిల్లెళ్లమూడి వంతెన వద్దకు రోడ్డు మార్గంలో చేరుకుని అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. తుపాను ప్రభావంతో దెబ్బతిన్న డ్రెయిన్లు, నీటిపారుదల వ్యవస్థపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను ముఖ్యమంత్రికి వివరించారు. నల్లమడ వాగు ద్వారా తరచూ వరదలు వస్తున్న పరిస్థితి, వాటి వల్ల కలుగుతున్న నష్టం, భవిష్యత్తులో తీసుకోవాల్సిన నివారణ చర్యలపై శాఖ ఎస్ఈ సీఎంకు వివరించారు. వరదనీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు, వర్షపు నీటిని సమర్థంగా వినియోగించుకునే మార్గాలను అన్వేషించాలని చంద్రబాబు సూచించారు.
అనంతరం రేటూరు ప్రాంతంలో దెబ్బతిన్న వరిపంటలను ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. పంట నష్టంపై రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోనున్నారు. తుపాను వల్ల వ్యవసాయ రంగానికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి, బాధిత రైతులకు అవసరమైన సహాయం అందించే అంశంపై అధికారులతో చర్చించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్