
ఆసిఫాబాద్, 06 నవంబర్ (హి.స.)
జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాం దగ్గర పోలీస్ బందోబస్తును మరింత పటిష్టం చేయాలని ఆసిఫాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. హరిత ఆదేశాలు జారీ చేశారు.
ఎన్నికల సామగ్రి విషయంలో చిన్న పొరపాటు కూడా జరగకూడదని, భద్రతా చర్యలను ఎప్పటికప్పుడు కంటికి రెప్పలా కాపాడాలని అధికారులకు స్పష్టం చేశారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఆమె గోదాంను సందర్శించారు.
అక్కడ ఏర్పాటు చేసిన సీల్స్ సరిగా ఉన్నాయా, రిజిస్టర్లు ఎలా నిర్వహిస్తున్నారు, సీసీ కెమెరాలు నిరంతరం పనిచేస్తున్నాయా అనే అంశాలను ఒక్కొక్కటిగా పరిశీలించారు. సీసీ కెమెరాలు ఒక్క క్షణం కూడా ఆగకుండా నడిచేలా చూడాలని, భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు