
హైదరాబాద్ , 06 నవంబర్ (హి.స.)
తెలంగాణలోని అర్హులైన ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో భారీ సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల జీవిత బీమా పథకాన్ని (Free Life Insurance Scheme) ఉచితంగా అమలు చేయాలని ప్రభుత్వం ఇవాళ నిర్ణయించింది.మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 19వ తేదీన ఈ ప్రతిష్టాత్మక ఉచిత బీమా పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఏదేని అవాంఛనీయ ఘటన జరిగి కుటుంబ యజమాని లేదా సభ్యులు మరణిస్తే, ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఆర్థికంగా ఆదుకోవడానికే ఈ రూ. 5 లక్షల ధీమాను అందిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.అంతేకాకుండా, అదే రోజున (నవంబర్ 19న) సిద్దిపేట వేదికగా రాష్ట్రవ్యాప్త 'ఇందిరమ్మ చీరల పంపిణీ' కార్యక్రమాన్ని కూడా ప్రారంభించేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళా సంఘాల సభ్యులకు మరియు పేద మహిళలకు ఈ చీరలను పంపిణీ చేయనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్