
హైదరాబాద్, 06 నవంబర్ (హి.స.)
చీకటిని తరిమి వెలుగులు పంచే దీపావళి పండుగకు ముందే హైదరాబాద్ నగర మార్కెట్లు రంగురంగుల కాంతులతో కొత్త అందాన్ని సంతరించుకున్నాయి.
ఎటు చూసినా మెరిసే విద్యుత్ దీపాలు, ఆకట్టుకునే అలంకరణ లైట్లు, సంప్రదాయ మట్టి ప్రమిదలు ప్రజలను ఆహ్వానిస్తున్నాయి. దీపావళి అంటేనే వెలుగులు, రంగులు, సంతోషాల కలయిక. ఈసారి పండుగను మరింత ఘనంగా జరుపుకోవాలని ప్రజలు తమ ఇళ్లను రకరకాల లైట్లతో అలంకరించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో మార్కెట్లలో పండుగ కొనుగోళ్ల హడావుడి మొదలైంది. ఈ ఏడాది మార్కెట్లోకి ఎన్నో కొత్త డిజైన్లలో లైట్లు వచ్చాయి. గతంలో ఎప్పుడూ చూడని విభిన్న ఆకారాలు, రంగుల్లో రూపొందించిన దీపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇళ్ల గోడలు, ప్రధాన ద్వారాలు, బాల్కనీలు, భవనాల పైభాగాలను అలంకరించుకునేందుకు వీలుగా చిన్న బల్బుల నుంచి పెద్ద సీరియల్ లైట్ల వరకు అన్ని రకాల అలంకరణ దీపాలు అందుబాటులో ఉన్నాయి. చిన్న ఇళ్ల నుంచి పెద్ద భవనాల వరకు కాంతులతో మెరిసిపోయేలా ఆకర్షణీయమైన లైట్లు కొలువుదీరాయి. ముఖ్యంగా రకరకాల రంగుల్లో వెలిగే లైట్లు, ప్రత్యేక ఆకృతుల్లో మెరిసే దీపాలు కొనుగోలుదారులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సాయంత్రం వేళ మార్కెట్ వీధుల్లో ఈ లైట్ల కాంతులు పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. తమ ఇంటిని అందరికంటే భిన్నంగా, అందంగా అలంకరించుకోవాలనే ఆసక్తితో ప్రజలు కొత్త డిజైన్ల లైట్లను ఎంపిక చేసుకుంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..