ఆన్లైన్లో టపాసులు కొనొద్దు
దీపావళి పర్వదినం సందర్భంగా టపాసులను ఆన్లైన్లో కొనుగోలు చేయవద్దని తెలంగాణ రాష్ట్ర ఫైర్ అండ్ క్రాకర్స్ అసోసియేషన్ వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది.
ఆన్లైన్


హైదరాబాద్, 06 నవంబర్ (హి.స.)

దీపావళి పర్వదినం సందర్భంగా టపాసులను ఆన్లైన్లో కొనుగోలు చేయవద్దని తెలంగాణ రాష్ట్ర ఫైర్ అండ్ క్రాకర్స్ అసోసియేషన్ వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన బాణసంచాకు బదులు, అమ్మకందారులు తమకు నచ్చిన సరుకును పంపిస్తున్నారని అసోసియేషన్ పేర్కొంది. అలా వచ్చే సరుకులో నాణ్యత లోపంతో పాటు, భద్రతాపరమైన లోపాలు కూడా ఉంటాయని, దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. సరుకు పంపిన తర్వాత ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడో కూడా తెలియదని తెలిపింది. చూపించిన బాణసంచా ఒకటైతే, పంపించేది మరొకటి అవుతుందని స్పష్టం చేసింది.

ఆర్డర్కు ముందే డబ్బులు పంపిన వారికి సరుకు కూడా రావడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని అసోసియేషన్ వెల్లడించింది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపుల్లో ఆకర్షణీయమైన యాడ్స్ తయారు చేసి, రకరకాల ఆఫర్లు ప్రకటించి వినియోగదారులను వలలో వేసుకుంటున్నారని ఆరోపించింది. ఈ ఆఫర్లన్నీ బూటకమని, పూర్తిగా మోసపూరితమని పేర్కొంది. వీటిని ఎవరూ ప్రోత్సహించవద్దని, కొనుగోలు చేసేందుకు ప్రయత్నించవద్దని సూచించింది. ఇలాంటి మోసాల వల్ల వినియోగదారులు తీవ్రంగా నష్టపోయి, మానసిక వేదనకు గురవుతున్నారని అసోసియేషన్ తెలిపింది.

---

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande