
హైదరాబాద్, 06 నవంబర్ (హి.స.)
రోజూ పాలు తాగే చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ హైదరాబాద్కు కల్తీ పాలను సరఫరా చేస్తున్న ముఠా వ్యవహారం వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న పాల వ్యాపారి అండే శ్రీశైలంను పోలీసులు అదుపులోకి తీసుకుని, వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో లోతుగా విచారణ జరుపుతున్నారు. ప్రజల నుంచి వచ్చిన ఆరోపణలతో రంగంలోకి దిగిన మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామంలో ఓ కేంద్రంపై ఆకస్మికంగా దాడి చేయగా అసలు గుట్టు బయటపడింది. అక్కడ హైడ్రోజన్ పెరాక్సైడ్, ధోల్పూర్ పాలపొడి వాడి నకిలీ పాలను తయారు చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
దాడి సమయంలో అక్కడ ఉన్న 100 లీటర్ల కల్తీ పాలు, ఒక లీటర్ హైడ్రోజన్ పెరాక్సైడ్తో పాటు ఒక్కోటి కిలో బరువున్న 35 ధోల్పూర్ పాలపొడి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. తయారు చేసిన ఈ కల్తీ పాలను హైదరాబాద్లోని వినియోగదారులకు పంపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సరఫరా వెనుక ఇంకా ఎంతమంది ఉన్నారో తేలాల్సి ఉండగా, మరిన్ని వివరాలు త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు