అద్దంకి నియోజకవర్గంలో తుపాను నష్టాలను పరిశీలించిన మంత్రి గొట్టిపాటి
మురసు తుపాను ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాల్లో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించి నష్టాలను స్వయంగా పరిశీలించారు.
Rain


అద్దంకి, 06 నవంబర్ (హి.స.)

మురసు తుపాను ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాల్లో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించి నష్టాలను స్వయంగా పరిశీలించారు. అద్దంకి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన.. రైతులు, స్థానిక ప్రజలకు జరిగిన నష్టాలపై వివరాలు తెలుసుకున్నారు.

మొదట ముప్పవరం గ్రామంలో తుపాను కారణంగా దెబ్బతిన్న మామిడి తోటలను పరిశీలించారు. అనంతరం కొండమంజులూరులో నష్టపోయిన నర్సరీని సందర్శించి మొక్కలకు జరిగిన నష్టాన్ని పరిశీలించారు. కోటపాడు గ్రామంలో గాలులు, వర్షాల ప్రభావానికి దెబ్బతిన్న ఇళ్లు, విద్యుత్ స్తంభాలను మంత్రి పరిశీలించారు. బాధితుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్తో పాటు వ్యవసాయశాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పంట నష్టానికి సంబంధించిన వివరాలను క్షేత్రస్థాయిలో సేకరించి, అంచనాల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. సమగ్ర నివేదికను వెంటనే అందజేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande