బియ్యం ధరల పెరుగుదలపై విజయశాంతి ఆందోళన
తెలంగాణలో రోజురోజుకూ పెరుగుతున్న బియ్యం ధరలు సామాన్యుల ఇంటి బడ్జెట్పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఆందోళన వ్యక్తం చేశారు.
Vijayashanthi


హైదరాబాద్, 06 నవంబర్ (హి.స.)

తెలంగాణలో రోజురోజుకూ పెరుగుతున్న బియ్యం ధరలు సామాన్యుల ఇంటి బడ్జెట్పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం పండించే రాష్ట్రంలోనే ప్రజలు బియ్యం కొనలేని దుస్థితి ఎందుకు ఏర్పడిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెరుగుతున్న బియ్యం ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో రూ.1,500కు లభించిన 25 కిలోల బియ్యం బస్తా ఇప్పుడు ఏకంగా రూ.2,500కు చేరిందని విజయశాంతి పేర్కొన్నారు. దీంతో ఒక్క బస్తాపైనే వినియోగదారులపై రూ.1,000 అదనపు భారం పడుతోందని అన్నారు. మరోవైపు కిలో సన్నబియ్యం ధర రూ.85 నుంచి రూ.100కు చేరడం ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. రోజువారీ అవసరాల్లో అత్యంత ముఖ్యమైన బియ్యం ధరలు ఇలా పెరిగితే మధ్య తరగతి, పేద కుటుంబాలపై ఆర్థిక భారం మరింత పెరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే నిత్యావసర ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు బియ్యం ధరల పెంపు మరో భారంగా మారిందని, సామాన్యులపై ఈ స్థాయిలో ధరల భారం మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బియ్యం ధరలను నియంత్రించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు విఫలమవుతోందని విజయశాంతి నిలదీశారు. ధాన్యం పండించే తెలంగాణలోనే ప్రజలు అధిక ధరలకు బియ్యం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి రావడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే మార్కెట్ పరిస్థితులను సమీక్షించి, ధరల నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande