
నాగర్ కర్నూల్, 06 నవంబర్ (హి.స.)
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ కుటుంబానికి పోలీస్ శాఖ అండగా నిలిచింది. ఆర్మ్డ్ రిజర్వు కానిస్టేబుల్ రాజు కుటుంబానికి రూ.కోటి బీమా పరిహారాన్ని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అందజేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోలీస్ శాలరీ ప్యాకేజీ ఇన్సూరెన్స్ కింద మంజూరైన ఈ చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాజు లేని లోటు కుటుంబానికి ఎన్నటికీ తీర్చలేనిదని, ఇలాంటి క్లిష్ట సమయంలో పోలీసు శాఖ ఎల్లప్పుడూ బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎస్బీఐ ప్యాకేజీ ద్వారా వచ్చిన ఈ పరిహారం కుటుంబానికి ఆర్థికంగా కొంత ఆసరాగా నిలుస్తుందని తెలిపారు. ప్రతి పోలీసు సిబ్బంది శాలరీ ప్యాకేజీతో పాటు ఆరోగ్య బీమా కూడా తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. గత ఆగస్టు నెలలో కొల్లాపూర్ సీఎం బందోబస్తు విధులు ముగించుకుని నాగర్‌కర్నూల్‌కు తిరిగి వస్తున్న సమయంలో రాజు పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఆయనకు ఎస్బీఐలో పోలీస్ శాలరీ ప్యాకేజీ ఖాతా ఉండటంతో బీమా నిబంధనల ప్రకారం బ్యాంకు యాజమాన్యం కోటి రూపాయల పరిహారాన్ని మంజూరు చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..