
అమరావతి , 06 నవంబర్ (హి.స.)
ఏలూరు జిల్లాలోని పలు పోలవరం నిర్వాసితుల పునరావాస కాలనీల్లో ఎన్నికల పోలింగ్‌కు స్థానికులు దూరంగా ఉన్నారు. తమ గ్రామాలకు ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఓటు వేయకుండా నిరసన వ్యక్తం చేశారు. కోరుటూరు, టేకూరు, గాజులగొంది, చీడూరు పునరావాస కాలనీల ప్రజలు పోలింగ్‌ను బహిష్కరించారు. పి.అంకంపాలెం పంచాయతీ పరిధి నుంచి తమ ప్రాంతాలను వేరు చేసి ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. తమ సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
మరోవైపు ములగలగూడెం, పైడాకులమామిడి, తూటికుంట, తల్లవరం, పల్లపూరు పునరావాస కాలనీల్లోని గిరిజనులు కూడా పోలింగ్‌లో పాల్గొనలేదు. ఐదు గ్రామాలను కలిపి ఒకే పంచాయతీగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్నికలను బహిష్కరించారు. దీంతో ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటింగ్ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు, ఇతర సిబ్బంది నిరసన తెలుపుతున్న గ్రామస్థులతో చర్చలు ప్రారంభించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఆందోళన విరమించి ఓటింగ్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు అంశంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్