
మన్యం జిల్లా , 06 నవంబర్ (హి.స.)
మన్యం జిల్లాలోని గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థులు జ్వరాలతో బాధపడుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ స్పందించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌తో పాటు వైద్యాధికారులతో మంత్రి మాట్లాడి ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు. ఎంతమంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు? వారికి ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నారు? ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అనే అంశాలపై ఆరా తీశారు.
గురుకులాల్లో చదువుకుంటున్న విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి అధికారులకు సూచించారు. జ్వరాలతో బాధపడుతున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు. అవసరమైన మందులు, వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని వైద్య సిబ్బందికి సూచించారు. గురుకుల ప్రాంగణాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, ఇతర విద్యార్థులకు అనారోగ్యం వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించకుండా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్