
తిరుమల , 06 నవంబర్ (హి.స.)
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలనా వ్యవహారాల్లో కీలక మార్పు చోటుచేసుకుంది. టీటీడీ ధర్మకర్తల మండలి పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఛైర్మన్‌గా టీటీడీ కార్యనిర్వహణాధికారి (ఈవో) ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకరించారు. తాజాగా ఆయన స్పెసిఫైడ్ అథారిటీ ఛైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేశారు.
ముగ్గురు సభ్యులతో కూడిన ఈ ప్రత్యేక అధికారుల కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలో ఈవో రవిచంద్ర ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా, ఆర్థిక శాఖ కార్యదర్శి వినయ్‌చంద్, దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు సభ్యులుగా బాధ్యతలు నిర్వహించనున్నారు. టీటీడీకి కొత్త పాలకమండలి ఏర్పాటయ్యే వరకు ఈ ప్రత్యేక అధికారుల కమిటీనే కీలక నిర్ణయాలు తీసుకుంటూ పరిపాలనా బాధ్యతలను పర్యవేక్షించనుంది.
ధర్మకర్తల మండలి గడువు ముగిసిన నేపథ్యంలో పాలనా పరమైన పనులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రభుత్వం ఈ ప్రత్యామ్నాయ ఏర్పాటును చేపట్టింది. తిరుమలలో భక్తులకు అందించే సేవలు, ఆలయ నిర్వహణ, పరిపాలనా నిర్ణయాలు, ఆర్థిక వ్యవహారాలు తదితర అంశాలను ప్రత్యేక అథారిటీ పర్యవేక్షించనుంది. కొత్త పాలకవర్గం కొలువుదీరే వరకు ఈ కమిటీ కొనసాగనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్