గుంటూరు వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి అరెస్టు
గుంటూరులో వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్సీ అప్పిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
Arrest


గుంటూరు , 06 నవంబర్ (హి.స.)

గుంటూరులో వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్సీ అప్పిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వెంగళాయపాలెంలో పోలింగ్ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు, అనంతరం జరిగిన ఆందోళన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. వెంగళాయపాలెంలో వైఎస్సార్సీపీకి చెందిన కొందరు నాయకులు పోలింగ్ సిబ్బంది నుంచి బ్యాలెట్ బాక్సును లాక్కున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ పరిణామాలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ నాయకులు నల్లపాడు ప్రాంతంలో రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కూడా పాల్గొన్నారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అప్పిరెడ్డిని అదుపులోకి తీసుకుని రాత్రి సమయంలో నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు.

పోలీసులు ఆయనను రాత్రంతా స్టేషన్లోనే ఉంచారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది విధులకు ఆటంకం కలిగించడం, ఆందోళనకు పాల్పడిన ఘటనలపై అప్పిరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ అరెస్టు గుంటూరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande