వాయిదా పడిన ఐదు మండలాల్లో నేడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్
తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో వాయిదా పడిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ను అధికారులు నేడు నిర్వహించనున్నారు.
Vote


అమరావతి , 06 నవంబర్ (హి.స.)

తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో వాయిదా పడిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ను అధికారులు నేడు నిర్వహించనున్నారు. మొత్తం ఐదు మండలాల్లో ఐదు జడ్పీటీసీ, 60 ఎంపీటీసీ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించక గతంలో ఎన్నికలను వాయిదా వేయాల్సి రావడంతో తాజాగా పోలింగ్ నిర్వహణకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం మండలంలో 18 ఎంపీటీసీ స్థానాలతో పాటు ఒక జడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ మండల పరిధిలో మొత్తం 64 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఏలూరు జిల్లాలోని నాలుగు మండలాల్లోనూ ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. వేలేరుపాడు, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. ఓటర్లు నిర్ణీత సమయానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల యంత్రాంగం సూచిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande