
హైదరాబాద్ , 06 నవంబర్ (హి.స.)
హైదరాబాద్ నగరవాసులకు, రోజువారీ ప్రయాణికులకు రవాణా శాఖ రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. ఇప్పటివరకు అత్యధిక ధర కారణంగా ఆదరణకు దూరమైన ఆర్టీసీ-మెట్రో కాంబో పాస్ ధరలపై కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గతంలో రూ. 8,500గా ఉన్న నెలవారీ ఉమ్మడి పాస్ ధరను భారీగా తగ్గిస్తూ రూ. 4,000గా నిర్ణయించింది. ఈ మేరకు నవంబర్ 8 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. రోజువారీ పాస్ ధరను కూడా రూ. 400 నుంచి రూ. 275కు తగ్గించారు.
ప్రజా రవాణాను ప్రోత్సహించడంతో పాటు సామాన్యుడి ప్రయాణ భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తగ్గించిన నెలవారీ రూ. 4,000 పాస్లో రూ. 3,000 మెట్రో రైలు ప్రయాణానికి, రూ. 1,000 టీజీఎస్ ఆర్టీసీ బస్సు సేవలకు కేటాయించనున్నారు. ఈ పాస్ ద్వారా ప్రయాణికులు నెలలో 50 రౌండ్ ట్రిప్పులు ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులు, విద్యార్థులకు ప్రతినెల వేల రూపాయల భారం తగ్గనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్