
భద్రాద్రి కొత్తగూడెం , 06 నవంబర్ (హి.స.)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ప్రాంతంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లిన ప్రాంతాల్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం ఉదయం పర్యటించారు. వర్షాలు, వరదల ఉధృతికి గండిపడిన ప్రసిద్ధ వెంకమ్మ చెరువును ఆయన స్వయంగా పరిశీలించారు. చెరువు కట్ట తెగిపోవడంతో నీరు సమీపంలోని వ్యవసాయ పొలాల్లోకి చేరి ఉద్యానవన, వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి, వెంకమ్మ చెరువు పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని స్పష్టం చేశారు. నీటమునిగిన పంట పొలాలను, దెబ్బతిన్న రోడ్లను క్షేత్రస్థాయిలో సర్వే చేసి తక్షణమే సమగ్ర నష్టపరిహారం నివేదిక సిద్ధం చేయాలని వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులను ఆదేశించారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్