
హైదరాబాద్ , 06 నవంబర్ (హి.స.)
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల ఉచిత జీవిత బీమా పథకం అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో అర్హులైన ప్రతి కుటుంబాన్ని ఈ పథకం పరిధిలోకి తీసుకురావడానికి ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా నవంబర్ 20 నుంచి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ కమిటీలు ప్రత్యక్ష సర్వే నిర్వహించి లబ్ధిదారుల నుండి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఈ పది రోజుల పాటు సాగే ప్రత్యేక డ్రైవ్లో ఇందిరమ్మ కమిటీ ప్రతినిధులు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తారు. అర్హులైన కుటుంబ యజమాని వివరాలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు మరియు నామినీ వివరాలను నమోదు చేస్తారు. నిరుపేద కుటుంబాలకు ఏదైనా ప్రమాదం లేదా అవాంఛనీయ సంఘటన జరిగి కుటుంబ పెద్ద మరణిస్తే ఆ కుటుంబం వీధిపాలవ్వకుండా ఆర్థిక భద్రత కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు. సర్వే పూర్తయిన వెంటనే లబ్ధిదారులకు క్లెయిమ్ ప్రక్రియ సులభతరం చేసేలా పత్రాలు జారీ చేయనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్