
హిందూపురం, 07 నవంబర్ (హి.స.)
హిందూపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రం దగ్గర కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) శ్రీనివాసరావు కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లారనే ఆరోపణలతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు. కౌంటింగ్ ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఆయన లోపలికి ఎలా వెళ్లారంటూ వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన కొందరు వైఎస్సార్సీపీ కార్యకర్తలు కౌంటింగ్ కేంద్రం ప్రధాన గేటు దూకి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అక్కడే భద్రతా విధులు నిర్వహిస్తున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని, అనంతరం తోపులాటకు దారితీసింది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆందోళన చేస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను అక్కడి నుంచి చెదరగొట్టారు. ఈ ఘటనతో కౌంటింగ్ కేంద్రం పరిసరాల్లో కొంతసేపు గందరగోళం నెలకొంది. ఎన్నికల లెక్కింపు కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్లపై వైఎస్సార్సీపీ శ్రేణులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్