
రాజన్న సిరిసిల్ల, 07 నవంబర్ (హి.స.)
గంభీరావుపేటలో బీజేపీ నాయకులు రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగారు. కారణం ఏంటంటే.. మండల కేంద్రంలో కోట్ల రూపాయలు పెట్టి కట్టిన కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇంకా తెరవలేదు. భవనం సిద్ధమై చాలా రోజులైనా ప్రారంభానికి నోచుకోకపోవడాన్ని వారు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ సందర్భంగా వారు మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డుపై కూర్చుని ధర్నా, రాస్తారోకో చేశారు. అధికారులు వచ్చి స్పష్టమైన మాట చెప్పే వరకు అక్కడి నుంచి కదలమని భీష్మించారు.
భవనం ఉన్నా వైద్యం అందకపోవడంతో పేదలే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని వారు ఆవేదన చెందారు. ఏళ్లుగా ఈ ఆసుపత్రి మూతపడి ఉండటంతో సామాన్యులకు సరైన చికిత్స దొరకడం లేదన్నారు. ముఖ్యంగా అత్యవసర సమయాల్లో పేదలు, గర్భిణీ స్త్రీలు చికిత్స కోసం వేరే ఊర్లకు పరుగులు తీయాల్సి వస్తోందని వాపోయారు.
వెంటనే ఆసుపత్రిని తెరిచి, అవసరమైన డాక్టర్లు, సిబ్బందిని వేసి అన్ని సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..