దీపావళి వేళ సైబర్ మోసగాళ్ల కొత్త ఎత్తుగడ
దీపావళి వేడుకల సమయాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ మోసగాళ్లు మరో కొత్త ఎత్తుగడతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Sajjanar


హైదరాబాద్, 07 నవంబర్ (హి.స.)

దీపావళి వేడుకల సమయాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ మోసగాళ్లు మరో కొత్త ఎత్తుగడతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

పేటీఎం నుంచి అందరికీ వెయ్యి రూపాయల దీపావళి బహుమతి వస్తోందంటూ వాట్సాప్ ద్వారా పెద్ద ఎత్తున తప్పుడు సందేశాలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ సందేశాలను నమ్మి అందులో ఉన్న లింకును నొక్కితే మొబైల్లోని వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం దొంగల చేతికి చిక్కే ప్రమాదం ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రజలను హెచ్చరించారు. ముందు తనకు కూడా ఇది నకిలీదే అనిపించిందని, కానీ నిజంగానే డబ్బులు వచ్చాయని చెబుతూ చాలా మంది ఒకరికొకరు ఈ మెసేజ్లను పంపుకుంటున్నారని, దీంతో చాలా మంది దీన్ని నిజమేనని నమ్మేస్తున్నారని ఆయన చెప్పారు. పండగ సందర్భంగా ప్రజల్లో ఉండే ఆశను వాడుకుని మోసగాళ్లు డబ్బు కొట్టేయాలని చూస్తున్నారని అప్రమత్తం చేశారు. తెలియని లింకులను అస్సలు తెరవవద్దని, అనుమానం కలిగించే వెబ్సైట్లలో ఎలాంటి వివరాలు నమోదు చేయవద్దని సూచించారు. అలా చేస్తే బ్యాంకు వివరాలతో పాటు ఖాతాలో ఉన్న సొమ్ము కూడా మాయమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ తరహా నకిలీ ఆఫర్లను ఇతర గ్రూపులకు ఫార్వర్డ్ చేయవద్దని, బ్యాంకింగ్ వివరాలు, యూపీఐ పిన్, ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి మోసానికి బలైతే వెంటనే 1930 నంబర్కు ఫోన్ చేయాలని లేదా సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande