కొడంగల్లో రూ. 9,000 కోట్లతో అభివృద్ధి పనుల జాతర: పర్యటన ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం నుంచి తన సొంత నియోజకవర్గమైన వికారాబాద్ జిల్లా కొడంగల్లో మూడు రోజుల సుదీర్ఘ పర్యటనను ప్రారంభించారు.
Telangana CM Revanth Reddy


వికారాబాద్ జిల్లా , 07 నవంబర్ (హి.స.)

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం నుంచి తన సొంత నియోజకవర్గమైన వికారాబాద్ జిల్లా కొడంగల్లో మూడు రోజుల సుదీర్ఘ పర్యటనను ప్రారంభించారు. శనివారం ఉదయం నియోజకవర్గానికి చేరుకున్న ముఖ్యమంత్రికి స్థానిక నాయకులు, అధికారులు మరియు ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా కొడంగల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు రూ. 9,000 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేశారు.

వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేట వద్ద కొత్తగా నిర్మిస్తున్న 'యంగ్ ఇండియా స్కిల్స్ & ఎడ్యుకేషన్ హబ్' ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 'మెగా రైతుమేళా' మరియు ఇండస్ట్రియల్ ఎక్స్పోలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని లాభసాటి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

అనంతరం లగచర్ల గ్రామంలో రూ. 81 కోట్ల వ్యయంతో నిర్మించనున్న పామాయిల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీకి సీఎం శంకుస్థాపన చేశారు. దీంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా కొత్తగా మంజూరైన బీసీ సంక్షేమ వసతి గృహాలు, పోలీస్ స్టేషన్ల భవనాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు బీటీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. కొడంగల్ సమగ్ర అభివృద్ధే తన లక్ష్యమని, పరిశ్రమల ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande