గచ్చిబౌలి మ్యారియట్ హోటల్లో అమెరికా వాసి మృతి: అనుమానాస్పద కేసు నమోదు
హైదరాబాద్లోని ఐటీ కారిడార్ గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న ఒక లగ్జరీ హోటల్ గదిలో అమెరికా పౌరుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందడం కలకలం రేపింది.
Unidentified dead body


హైదరాబాద్ , 07 నవంబర్ (హి.స.)

హైదరాబాద్లోని ఐటీ కారిడార్ గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న ఒక లగ్జరీ హోటల్ గదిలో అమెరికా పౌరుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందడం కలకలం రేపింది. కాలిఫోర్నియాకు చెందిన మైఖేల్ బ్రియన్ లీ (41) అనే వ్యక్తి గచ్చిబౌలిలోని ఎస్ఎల్ఎన్ టెర్మినస్ వద్ద ఉన్న మ్యారియట్ ఎగ్జిక్యూటివ్ అపార్ట్మెంట్స్ హోటల్ 12వ అంతస్తులోని రూమ్ నంబర్ 1218లో విగతజీవుడిగా పడి ఉన్నట్లు పోలీసులు శనివారం అధికారికంగా వెల్లడించారు.

పోలీసుల కథనం ప్రకారం... మైఖేల్ బ్రియన్ లీ తన వ్యాపార భాగస్వామి డేవిడ్తో కలిసి బిజినెస్ ట్రిప్ నిమిత్తం నవంబర్ 2న హైదరాబాద్కు వచ్చి ఈ హోటల్లో బస చేశారు. నవంబర్ 4 సాయంత్రం నుంచి మైఖేల్ ఫోన్ కాల్స్కు స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది గది తలుపులు తెరిచి చూడగా ఆయన మంచంపై అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించగా, పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు.

గచ్చిబౌలి పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీమ్తో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక మరియు ఫోరెన్సిక్ పరీక్షల ఫలితాలు వస్తేనే మృతికి గుండెపోటా లేదా మరేదైనా కారణమా అనేది స్పష్టమవుతుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande