మధ్యప్రదేశ్లో విషాదం .. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవ దహనం
మధ్యప్రదేశ్లోని సివ్నీ జిల్లా ఛపారా పట్టణంలో పండుగ వేళ విషాదం చోటుచేసుకుంది.
Accident


సివ్నీ జిల్లా , 09 నవంబర్ (హి.స.)

మధ్యప్రదేశ్లోని సివ్నీ జిల్లా ఛపారా పట్టణంలో పండుగ వేళ విషాదం చోటుచేసుకుంది.

మహావీర్ వార్డులో ఉన్న బంగారం వ్యాపారి కుందన్ లాల్ సోనికి చెందిన మూడంతస్తుల ఇంట్లో సోమవారం తెల్లవారుజామున దాదాపు 3 గంటలకు మంటలు చెలరేగాయి.

అందరూ గాఢ నిద్రలో ఉండటంతో మంటలు, దట్టమైన పొగ వేగంగా ఇల్లంతా వ్యాపించాయి. బయటకు రావడానికి దారి లేక ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ప్రమాదం గురించి తెలియగానే ఫైర్ సిబ్బంది, పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటల మధ్య చిక్కుకున్న వారిని బయటకు తీసినా, అప్పటికే ఆరుగురు చనిపోయినట్టు వైద్యులు తెలిపారు.

మరికొందరికి తీవ్ర గాయాలవడంతో వారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

చనిపోయిన వారిలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. వారిని కుందన్ లాల్ సోని(75), రాజకుమారి సోని(65), సూర్య సోని(45), రీతూ సోని(42), స్మృతి సోని(40), ఆదిత్య సోని(16)గా గుర్తించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande