ఈడీ 'సూపర్ పోలీస్' కాదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారాల పరిధిపై కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో జరిగే ప్రతి అవినీతి, అక్రమ వ్యవహారంలో ఈడీ తనంతట తానుగా జోక్యం చేసుకుని దర్యాప్తు ప్రారంభించలేదని స్పష్టం చేసింది.
Court


ఢిల్లీ , 09 నవంబర్ (హి.స.)

ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారాల పరిధిపై కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో జరిగే ప్రతి అవినీతి, అక్రమ వ్యవహారంలో ఈడీ తనంతట తానుగా జోక్యం చేసుకుని దర్యాప్తు ప్రారంభించలేదని స్పష్టం చేసింది. ఈడీ అనేది అన్ని దర్యాప్తు సంస్థలకంటే అధిక అధికారాలు కలిగిన 'సూపర్ పోలీస్' కాదని అభిప్రాయపడింది.

YB అశ్వతనారాయణ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద ఈడీకి ఉన్న అధికారాలు పరిమితమైనవని పేర్కొంది. మనీలాండరింగ్ కేసులో దర్యాప్తు చేపట్టాలంటే ముందుగా సంబంధిత చట్టాల కింద ప్రాథమిక నేరం నమోదై ఉండాలని వివరించింది.

కేవలం ఏదైనా అక్రమం జరిగినట్లు సమాచారం అందిందనే కారణంతో ఈడీ స్వతంత్రంగా క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టడానికి వీల్లేదని కోర్టు పేర్కొంది. అలాగే సాధారణ వ్యక్తి మాదిరిగా BNSS సెక్షన్ 223 కింద ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేసి, దాని ఆధారంగా దర్యాప్తు ప్రారంభించే అధికారం కూడా PMLA ఈడీకి కల్పించలేదని స్పష్టం చేసింది.

చట్టం నిర్దేశించిన పరిధిలోనే ప్రతి దర్యాప్తు సంస్థ పనిచేయాలని, ఈడీ కూడా చట్టానికి లోబడి ఉండాల్సిందేనని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలు ఈడీ అధికారాలపై మరోసారి చర్చకు దారితీశాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande