
న్యూ ఢిల్లీ , 09 నవంబర్ (హి.స.)
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ప్రయాణికుల నుంచి లభిస్తున్న ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. దేశంలోని ఒక కీలక రూట్లో ఈ రైలు ఆక్యుపెన్సీ 189.35 శాతానికి చేరుకోవడం దీని ప్రజాదరణకు నిదర్శనం. అంటే అందుబాటులో ఉన్న మొత్తం సీట్లతో పోలిస్తే ప్రయాణికుల డిమాండ్ దాదాపు 1.9 రెట్లు నమోదైంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సుమారు 3.98 కోట్ల మంది ప్రయాణికులు వందే భారత్‌లో ప్రయాణించగా, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది దాదాపు 34 శాతం పెరుగుదలను సూచిస్తోంది.
ఈ భారీ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ వందే భారత్ సేవలను కేవలం చైర్ కార్లకే పరిమితం చేయకుండా స్లీపర్ సర్వీసుల వైపు కూడా వేగంగా విస్తరిస్తోంది. ఫిబ్రవరి 2019లో దేశంలోనే తొలి వందే భారత్ చైర్ కార్ ప్రారంభమైన ఢిల్లీ-వారణాసి మార్గంలో ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నూతన వందే భారత్ స్లీపర్ రైలును కూడా ప్రారంభించారు. నవంబర్ 2 నుంచి దీని వాణిజ్య సేవలు క్రమబద్ధంగా అందుబాటులోకి వచ్చాయి. ఇక దక్షిణ భారతదేశంలోని మంగళూరు-తిరువనంతపురం రూట్ అత్యధిక ఆక్యుపెన్సీతో అగ్రస్థానంలో నిలవగా, హౌరా-కామాఖ్య మధ్య నడిచే తొలి స్లీపర్ వందే భారత్ కూడా 114.54 శాతం ఆక్యుపెన్సీ సాధించింది.
రైల్వే బోర్డు అధికారిక రికార్డులు 2025-26 ఆర్థిక సంవత్సరంలో వందే భారత్ సాధించిన వృద్ధికి అద్దం పడుతున్నాయి. రైల్వే బోర్డు పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టరేట్ కోరిన సమాచారానికి సమాధానంగా టీజీ-1 బ్రాంచ్ అందించిన వివరాల ప్రకారం... మంగళూరు సెంట్రల్, తిరువనంతపురం సెంట్రల్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అత్యధిక ఆక్యుపెన్సీ సాధించింది. తిరువనంతపురం సెంట్రల్ నుండి మంగళూరు సెంట్రల్ వెళ్లే రైలు (నంబర్ 20632) 189.35 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేయగా, మంగళూరు నుండి తిరువనంతపురం వెళ్లే రైలు (నంబర్ 20631) 174.77 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ఈ మార్గంలో రెండు దిశల్లోనూ ఆక్యుపెన్సీ 170 శాతానికి పైగానే నమోదవ్వడం విశేషం.
రైలులో సీట్లు పరిమితంగా ఉన్నప్పుడు ఆక్యుపెన్సీ 100 శాతం కంటే ఎక్కువ ఎలా వస్తుందనే సందేహం కలగడం సహజం. ఆక్యుపెన్సీ అనేది ఒకే సమయంలో రైలులో ఉండే ప్రయాణికుల సంఖ్య మాత్రమే కాకుండా, పూర్తి ప్రయాణంలో సీట్ల వినియోగాన్ని బట్టి లెక్కించబడుతుంది. సుదూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో ప్రయాణికులు వేర్వేరు స్టేషన్లలో ఎక్కుతూ, దిగుతూ ఉంటారు. ఒక ప్రయాణికుడు దిగిన తర్వాత అదే సీటును తదుపరి స్టేషన్ నుంచి వేరొకరు బుక్ చేసుకుంటారు. ఇలా ఒకే సీటు ప్రయాణంలోని వేర్వేరు భాగాల్లో పలుమార్లు ఉపయోగపడటం వల్ల మొత్తం ఆక్యుపెన్సీ 100 శాతం దాటుతుంది. కాబట్టి 189.35 శాతం అంటే ఒకే సమయంలో రెట్టింపు మంది కూర్చున్నారని కాకుండా, ఆ మార్గంలో సీట్ల డిమాండ్, వినియోగం ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తుంది.
వందే భారత్ రైళ్లకు ప్రయాణికుల ఆదరణ గణనీయంగా పెరుగుతోంది. రైల్వే మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో 3.98 కోట్ల మంది వందే భారత్‌లో ప్రయాణించగా, 2024-25లో ఈ సంఖ్య 2.97 కోట్లుగా ఉండేది. వందే భారత్ సేవలు ప్రారంభమైన నాటి నుండి ఏప్రిల్ 2026 నాటికి మొత్తం 9.1 కోట్లకు పైగా ప్రయాణికులు ఈ రైళ్లలో ప్రయాణించారు. ప్రయాణికుల సంఖ్య పరంగా న్యూఢిల్లీ-వారణాసి రూట్ మొదటి స్థానంలో నిలిచి, ఇప్పటివరకు 73 లక్షలకు పైగా ప్రయాణికులను చేరవేసింది.
ఈ ఆదరణను బట్టి రైల్వే శాఖ స్లీపర్ సేవలను శరవేగంగా విస్తరిస్తోంది. 15 ఫిబ్రవరి 2019న న్యూఢిల్లీ-కాన్పూర్-ప్రయాగ్‌రాజ్-వారణాసి కారిడార్‌లో తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం కాగా, ఏడేళ్ల తర్వాత అదే రూట్లో స్లీపర్ వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. 31 అక్టోబర్ 2026న వారణాసిలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కలసి వారణాసి-న్యూఢిల్లీ వందే భారత్ స్లీపర్ (రైలు నంబర్లు 27421/27422) సర్వీసును ప్రారంభించారు. నవంబర్ 2 నుండి దీని సాధారణ సేవలు షురూ అయ్యాయి. ఇది ఉత్తరప్రదేశ్‌లో మొదటిది, దేశంలో రెండవ వందే భారత్ స్లీపర్ సర్వీస్.
దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ సర్వీస్ జనవరి 2026లో హౌరా-కామాఖ్య మధ్య ప్రారంభమైంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో హౌరా నుండి కామాఖ్య వెళ్లే రైలు (27575) 127.66 శాతం, కామాఖ్య నుండి హౌరా వచ్చే రైలు (27576) 103.54 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేశాయి. రెండు దిశలు కలిపి ఈ స్లీపర్ రైలు సగటున 114.54 శాతం ఆక్యుపెన్సీ సాధించింది. రాత్రిపూట ప్రయాణించే ఈ స్లీపర్లకు మంచి స్పందన వస్తుండటంతో నవంబర్ 2026లో బెంగళూరు-ముంబై మధ్య మరొక వందే భారత్ స్లీపర్ సర్వీస్ కూడా అందుబాటులోకి వచ్చింది.
ఢిల్లీ-వారణాసి మధ్య నడుస్తున్న నాలుగు చైర్ కార్ వందే భారత్ సర్వీసుల్లోనూ ఆక్యుపెన్సీ 114 శాతానికి పైగానే నమోదు కావడం విశేషం. రైలు నంబర్ 22415 (వారణాసి నుండి న్యూఢిల్లీ) 117.26 శాతం, రైలు నంబర్ 22416 (న్యూఢిల్లీ నుండి వారణాసి) 114.05 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేశాయి. అలాగే రెండో జత రైళ్లు (22435/22436) కూడా 117.25 శాతం, 115.19 శాతం ఆక్యుపెన్సీని సాధించాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 81 జతలు (162 సర్వీసులు) చైర్ కార్ వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. వీటితో పాటు హౌరా-కామాఖ్య, వారణాసి-న్యూఢిల్లీ, బెంగళూరు-ముంబైల మధ్య ఉన్న 3 జతల స్లీపర్ సర్వీసులతో కలిపి దేశంలో మొత్తం 84 జతలు (168 డైరెక్షనల్ సర్వీసులు) అందుబాటులో ఉన్నాయి.
ఆదాయం విషయంలో రైల్వే శాఖ ప్రతి రైలు ఆదాయాన్ని ప్రత్యేకంగా లెక్కించకుండా మొత్తం ప్రయాణికుల ఆదాయంలోనే చేరుస్తుంది. అయితే ప్రాంతీయంగా సేకరించిన వివరాల ప్రకారం దక్షిణ రైల్వే పరిధిలో వందే భారత్ సర్వీసులు 2024-25లో రూ. 540.65 కోట్ల ఆదాయం సాధించగా, 2025-26 నాటికి అది రూ. 803.86 కోట్లకు చేరింది. అంటే ఒక్క ఏడాదిలోనే దాదాపు రూ. 263 కోట్ల మేర ఆదాయం పెరిగింది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వే మొత్తం ప్రయాణికుల ఆదాయం రూ. 80 వేల కోట్లు కాగా, మునుపటి ఏడాదితో పోలిస్తే ఇది 5.96 శాతం పెరుగుదలను చూపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా వందే భారత్ చైర్ కార్ల సగటు ఆక్యుపెన్సీ 99.10 శాతంగా నమోదైంది.
వందే భారత్ రైళ్లు ప్రారంభమైన నాటి నుండి నేటివరకు కేవలం చైర్ కార్లకే పరిమితం కాకుండా సుదూర ప్రాంతాలకు స్లీపర్ సర్వీసులుగా ఎదగడం, ఒక రూట్లో 189.35 శాతం ఆక్యుపెన్సీ సాధించడం, ప్రయాణికుల సంఖ్య ఏడాదిలోనే 34 శాతం పెరగడం ఈ నెట్వర్క్ విజయవంతమైన విస్తరణకు నిదర్శనం.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi