
ఢిల్లీ , 09 నవంబర్ (హి.స.)
నవంబర్ 9న ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఉత్తరాఖండ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. హిమాలయాలు, పవిత్ర నదులు, ప్రసిద్ధ చార్ధామ్ క్షేత్రాలతో దేవభూమికి ఉన్న ప్రత్యేకతను సోషల్ మీడియాలో ఆయన గుర్తుచేశారు. ఆధ్యాత్మిక వైభవం, ప్రకృతి అందం, సాంస్కృతిక సంపదతో పాటు అక్కడి ప్రజల కష్టపడే గుణం, ప్రతిభ, అభివృద్ధిపై ఉన్న దృష్టి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తున్నాయని ప్రశంసించారు. ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రం కొత్త మైలురాళ్లు చేరుకుంటోందని, ఇదే వేగంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ సుఖం, సంతోషం, శ్రేయస్సు కలగాలని కోరుకున్నారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఉత్తరాఖండ్ ప్రజలకు అభినందనలు తెలిపారు. అక్కడి ప్రకృతి సౌందర్యం, జానపద సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వం, వీరత్వ సంప్రదాయాలను ఆయన కొనియాడారు. దేశ సాంస్కృతిక చైతన్యంలో ఉత్తరాఖండ్‌కు ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో, సీఎం పుష్కర్ సింగ్ ధామి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతూ ప్రతి రంగంలో పురోగతి సాధిస్తోందని అభిప్రాయపడ్డారు.
2000 నవంబర్ 9న ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయి ఉత్తరాఖండ్ దేశంలో 27వ రాష్ట్రంగా ఏర్పడింది. ఎన్నో ఏళ్ల ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తర్వాత ఈ ఏర్పాటు జరిగింది. డెహ్రాడూన్ రాజధానిగా కొనసాగుతోంది. హిమాలయ ప్రాంతంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని దేవభూమి అని పిలుస్తారు. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ అనే నాలుగు పుణ్యక్షేత్రాలు చార్‌ధామ్‌గా ప్రసిద్ధి చెందాయి. ప్రకృతి సౌందర్యం, పవిత్ర నదులు, పర్వతాలు, ఆధ్యాత్మిక కేంద్రాలతో ఉత్తరాఖండ్ దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు