
హైదరాబాద్, 23 ఫిబ్రవరి (హి.స.)
గడిచిన మూడు నెలలుగా జీతాలు
ఇవ్వడం లేదని ఆశా వర్కర్లు (ASHA workers) నిరసనకు దిగారు. ఇందులో భాగంగా హైదరాబాద్లోని కోఠిలో ఉన్న డీఎంహెచ్ (DMHO) కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గత మూడు నెలలుగా వేతనాలు అందక పోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తక్షణమే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది ఆశా వర్కర్లు కార్యాలయాన్ని ముట్టడించారు. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది.
ఈ క్రమంలో పోలీసులు నిరసనకారులను బలవంతంగా అక్కడి నుండి ఈడ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ తోపులాటలో ఒక ఆశా వర్కర్ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోవడంతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. తోటి వర్కర్లు ఆందోళన వ్యక్తం చేయగా, పోలీసులు వెంటనే స్పందించి ఆమెను అంబులెన్స్లో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళా వర్కర్ల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆశా వర్కర్లు తమ డిమాండ్లను వివరిస్తూ.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తమ సమస్యల పరిష్కారానికి నిధులు పెంచాలని, కనీస వేతనం రూ.18 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం పెంచిన రూ. 1,500 పారితోషికాలను వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం తమ గోడు పట్టించుకోకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ఆశా వర్కర్లు హెచ్చరికలు జారీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు