
హైదరాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.)
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ
(TGSRTC)కు ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ (ఓజీఎల్ ) 1085 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేయనుంది. ఈ మేరకు ఓలెక్ట్రా సంస్థ(Olectra Company) టీజీఎస్ఆర్టీసీ లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్బీఐ) జారీ చేసింది. పీఎంఈ డ్రైవ్ పథకం (PME Drive Scheme)లో భాగంగా పర్యావరణ అనుకూల ఇంధన, విద్యుత్ వాహనాల ను ప్రోత్సహించే కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (సీఈఎస్ఎల్) ఆధ్వర్యంలో ఈ లేఖను జారీ చేసింది. టీజీఎస్ ఆర్టీసీకి ఓలెక్ట్రా 12 మీటర్ల పొడవు ఉన్న లో ఫ్లోర్ బస్సులను సరఫరా చేస్తుంది. ఇందులో ఏసీ, నాన్-ఏసీ బస్సులున్నాయి. స్థానిక రోడ్ల పరిస్థితులకు అనుగుణంగా వీటిని రూపొందించారు.
బస్సు ముందు, వెనుక భాగంలో ఆధునిక ఎయిర్ సస్పెన్షన్ వ్యవస్థతో ఒక్కసారి చార్జ్ చేస్తే 250 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేస్తాయి. సుమారు 45 నిమిషాల్లో చార్జింగ్ సౌకర్యం ఈ బస్సుల్లో ఉంది. బస్సులో వీల్చైర్ ప్రయాణికులకు ప్రత్యేక స్థలం కేటాయించారు. దేశవ్యాప్తంగా 3,600కి పైగా ఎలక్ట్రిక్ వాహనాలను విజయవంతంగా ప్రవేశపెట్టిన ఓలెక్ట్రా చేతిలో ప్రస్తుతం 10 వేల విద్యుత్ వాహనాల ఆర్డర్ ఉంది. ఈ సందర్భంగా ఒలెక్ట్రా ఎండీ మహేశ్ బాబు మాట్లాడుతూ.. 'మేక్ ఇన్ ఇండియా' దృష్టితో ప్రపంచ స్థాయి ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేయాలనే తమ కట్టుబాటుకు పీఎంఈ-డ్రైవ్ కార్యక్రమం కింద వచ్చిన ఈ ప్రతిష్టాత్మక ఆర్డర్ మరింత బలం చేకూర్చిందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు