
ఆదిలాబాద్, 23 ఫిబ్రవరి (హి.స.)
ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉట్నూరు మండలం షాంపూర్ గ్రామం వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఆసిఫాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదిలాబాద్ వెళ్తుండగా అదుపుతప్పి సమీపంలోని కల్వర్టును ఢీకొట్టి వాగులో పడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులోని డ్రైవర్, కండక్టర్తో పాటు మొత్త 30 మందికి ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు షాంపూర్ సమీపంలోని వంతెన వద్దకు చేరుకోగానే అదుపుతప్పి ఒక్కసారిగా వాగులోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికుల ఆర్తనాదాలతో ప్రాంతమంతా దద్దరిల్లింది. గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
అనంతరం ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు, 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని బస్సు కిటికీలు, తలుపుల గుండా బయటకు తీసి, చికిత్స నిమిత్తం ఉట్నూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది..
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు